విజయవాడలో భూకబ్జా వ్యవహారంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి తనకు చెందిన స్థలాన్ని గౌతమ్ రెడ్డి కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు. బెదిరింపులకు పాల్పడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో వీడియోలు బయటకు రావడం వల్ల తన పరువు పోతుందని ఉమా మహేశ్వరరావుపై గౌతమ్ రెడ్డి సుపారీ గ్యాంగ్ కు డబ్బులు ఇచ్చి దాడి చేయించాడు. రూ.24 లక్షలు సుపారీ గ్యాంగ్ కు ఇచ్చి యజమాని కాళ్లు చేతులు విరిచేయాలని చెప్పినట్టు తెలుస్తోంది.
దీంతో ఉమామహేశ్వర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తుండగా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గౌతమ్ రెడ్డి గురించి మీడియా సమావేశంలో సీపీ సంచలన నిజాలు బయటపెట్టారు. గౌతమ్ రెడ్డిపై గతంలోనే 42 కేసులు ఉన్నట్టు తెలిపారు. 1998 నుండి గౌతమ్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడటం, ఇతర దందాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఆయనపై రౌడీ షీట్ కూడా నమోదు చేసినట్టు వెల్లడించారు.
దీపావళి పండుగ రోజున ఉమామహేశ్వర రావు ఇంటిపైకి గౌతమ్ రెడ్డి మనుషులను పంపించినట్టు చెప్పారు. కేసులను వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపారు. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నారని ఆయన కోసం రెండు బృంధాలు గాలిస్తున్నాయని అన్నారు. గౌతమ్ రెడ్డి సుపారీ ఇచ్చిన గ్యాంగ్ సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గౌతమ్ రెడ్డి గ్యాంగ్ కు సుపారీ ఇచ్చినట్టు వీడియో రికార్డు అయిందని ఆ వీడియో ఆధారంగా విచారణ జరుపుతున్నామని చెప్పారు.