E-PAPER

గప్పాలు కొట్టడం కాదు- అన్నపై నుంచి ఫోకస్ తప్పించిన షర్మిల..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌ వ్యవహారం మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. అటు వైఎస్ జగన్, ఆయన చెల్లెలు, ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం నడిచింది.

 

ఇప్పుడీ వివాదంపై నుంచి తన ఫోకస్‌ను మళ్లించారు షర్మిల. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

 

విద్యుత్ ఛార్జీలపై ఉద్యమించనున్నారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాలు, రాస్తారోకోలు, బైఠాయింపులు నిర్వహించనున్నట్లు షర్మిల వెల్లడించారు. పార్టీ శ్రేణులందరూ ఇందులో పాల్గొనాలని సూచించారు.

 

ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గప్పాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్.. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతో మరో వైపు వాతలు పెడుతోందని షర్మిల విమర్శించారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదేనని మండిపడ్డారు.

 

ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది 2,685 కోట్ల రూపాయలు కాగా.. ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ. 6,000 కోట్లని ఆరోపించారు. ఇంకా 3,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై అదనంగా పడుతోందని అన్నారు.

 

దీపం – 2 కింద వెలుగులు పక్కన పెడితే- కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం కారు చీకట్లను నింపుతోందని షర్మిల ధ్వజమెత్తారు. ఇదంతా గత వైసీపీ ప్రభుత్వంపై నెట్టేసి, తమకు సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది ఏపీఈఆర్సీనే తప్ప.. తాము కాదని కూటమి చెబుతోండటం కుంటి సాకులే తప్ప మరొకటి కాదని అన్నారు.

 

గత ప్రభుత్వం తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరమైతే 35 శాతం ఛార్జీలను తగ్గిస్తామని హామీలు సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కూటమి ఏంటి తేడా? అంటూ ఆమె నిలదీశారు.

 

అయిదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయల భారం మోపితే, చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ భారాన్ని కొనసాగించడం మొదలు పెట్టిందని మండిపడ్డారు. 6,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపడం భావ్యం కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి సాయం తీసుకుని రావాలని అన్నారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram