E-PAPER

పాతాళలోకాలను అన్వేషించనున్న భారత్.. మత్స్య 6000 మిషన్..!

భారతదేశం గగనతలంపైనే కాదు పాతాళ లోకంలోనూ అడుగు పెట్టేందుకు చకచక అడుగులు వేస్తుంది. అంతరిక్ష తలంలో విభిన్న అన్వేషణలకు శ్రీకారం చుట్టిన భారత్ ఇప్పుడు సముద్రగర్భంలోనూ అన్వేషణలకు శ్రీకారం చుట్టింది. సముద్రయాన్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకు వెళుతుంది. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్ మెషిన్ ను కూడా భారతదేశం సిద్ధం చేసింది.

 

సముద్రయాన్ లో వినూత్న ఆవిష్కరణ మత్స్య 6000

మత్స్య 6000 పేరుతో తయారుచేసిన ప్రత్యేకమైన డైవింగ్ మిషన్ సముద్ర గర్భంలో ఆరువేల మీటర్ల లోతుకు వెళ్లి 12 గంటల వ్యవధిలోనే తిరిగి రానుంది. ఇక ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ లో ప్రయాణం చేసే సభ్యుల కోసం ప్రత్యేక ఆహారాన్ని కూడా డిఆర్డిఓ సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితులను తట్టుకునేలా దీనిని రూపొందించి సముద్ర గర్భంలోకి పంపనుంది.

 

ఈ సబ్ మెర్సిబుల్ వెహికిల్ ప్రత్యేకతలివే

సంక్లిష్ట సమయంలో 96 గంటల పాటు సిబ్బంది దీనిలో ఉండేలా ఏర్పాట్లు కూడా చేసింది. మొత్తం దీనిలో 67 ఆక్సిజన్ సిలిండర్లు పనిచేస్తూ ఉంటాయి. సముద్ర గర్భంలోకి వెళ్లడానికి మూడు గంటలు, రావడానికి మూడు గంటల పాటు, సముద్ర గర్భంలో పరిశోధన చేయడం కోసం ఆరు గంటలు ఉండేలాగా ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ ను రూపొందించారు. సముద్రంలోని అత్యంత లోతైన ప్రదేశంలో 108 గంటలు ఈ వెహికల్ ఉండగలుగుతుంది.

 

సముద్రంలో 6000 మీటర్ల కిందకు వెళితే 596 రెట్లు ఎక్కువ ఒత్తిడి

అయితే ఈ సబ్ మెర్సిబుల్ వెహికల్ మత్స్య పై సముద్ర గర్భంలోకి వెళ్ళినప్పుడు 6000 మీటర్ల కిందకు వెళితే 596 రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది దాదాపు 1848 ఏనుగుల బరువుకు సమానంగా ఉంటుందని సమాచారం . దీని తయారీ కోసం 80 ఎంఎం మందంతో ఉన్న టైటాన్ అలాయ్ ను వాడారు.

 

పాతాళ లోకాలను అన్వేషించనున్న భారత్

దాదాపు 2.1 మీటర్ పొడవు ఉన్న ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతుకు వెళ్లి పాతాళ లోకాలను అన్వేషించనుంది. భవిష్యత్తులో సముద్రగర్భ పర్యాటక అభివృద్ధి కోసం కూడా దీనిని వినియోగించనున్నారు..మత్స్య 6000 సముద్ర జలాల్లోకి పంపించడానికి సాగర్ నిధి అనే రీసెర్చ్ నౌకను కూడా సిద్ధం చేశారు. ఇది నీటి ఉపరితలంపై నుంచి ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ కు సహకరిస్తుంది.

 

మిషన్ సక్సెస్ అయితే ఆ దేశాల చెంత భారత్

ఇక ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే సముద్ర లోతులను అన్వేషించగల సామర్థ్యం ఉన్న దేశాల చెంత భారత్ కూడా చేరుతుంది. ఇప్పటికే సముద్ర లోతులను అన్వేషించగల సామర్థ్యం అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాలకు ఉంది. ఇక ఈ దేశాల చెంత భారత్ కూడా సగర్వంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం మన దేశం దాదాపు 4077 కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. ఇది సక్సెస్ అయితే గగనతలాన్నే కాదు పాతాళ లోకాలను కూడా అన్వేషించే శక్తివంతమైన దేశంగా భారతదేశం నిలుస్తుంది.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram