తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ప్రతీ మహిళ ఖాతాల్లో నెలకు రూ 2500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఈ హామీ పైన రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో మహిళలకు రుణాల పైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేసారు.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రం లో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఈ ఏడాదే రూ.20 వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ చిన్నతరహా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి వారికి కేటాయించనున్నట్లు వెల్లడించారు.
వడ్డీ లేని రుణాలు తీసుకుని పరిశ్రమలు స్థాపించాలని, ఆర్థిక స్వావలంబనతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సలు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.400 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. ఎవరైనా మహిళా సంఘాలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హెచ్చరించారు. తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలోనూ భవిష్యత్తులో వారికి భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు.