E-PAPER

రాజ్ పాకాల పిటీషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులను జారీ చెయ్యగా, ఆయన విచారణకు హాజరు కాకుండా కోర్టును ఆశ్రయించారు. ఇక ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం ఆయనకు కాస్త ఊరట కలిగించే నిర్ణయం వెల్లడించింది.

 

పోలీస్ నోటీసులు ఇచ్చినా పోలీసుల ఎదుట హాజరుకాని కేటీఆర్ బావమరిది

ఈరోజు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు .అడ్రస్ ప్రూఫ్ లతో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పోలీసులు కోరారు ఇక విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు నోటీసులలో హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఆయన పోలీసుల ఎదుట హాజరు కాలేదు.

 

కోర్టు కీలక ఆదేశాలు

ఇక కోర్టులో రాజ్ పాకాల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు రాజ్ పాకాలకు రెండు రోజుల సమయం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారమే ఈ కేసులో దర్యాప్తుకు ముందుకు వెళ్లాలని కోర్టు పోలీసులకు సూచించింది.

 

రాజ్ పాకాల తరపు వాదనలు ఇలా

ఈరోజు విచారణ జరపగా పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. రాజ్ పాకాల ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారని, రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే, రాజ్ పాకాల ను నిందితుడిగా చేర్చారని పేర్కొన్నారు. డ్రగ్స్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వాలని మహిళలను కూడా ఇబ్బంది పెట్టారని, వారు కోర్టు ధర్మాసనం ముందు వాదించారు.

 

ఎవరిని అరెస్టు చేయలేదన్న ప్రభుత్వం తరపు న్యాయవాది

ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిది కాబట్టే ఆయనను టార్గెట్ చేశారని, రాజకీయ దురుద్దేశంతోనే ఆయన పైన కేసులు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనను వినిపించి ఇప్పటివరకు కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని అక్రమంగా మద్యం బాటిల్స్ లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రావడంతో విచారణ జరుపుతున్నామని తెలిపారు.

 

రాజ్ పాకాలకు నిబంధనల మేరకే 41 నోటీసులు ఇచ్చామని వెల్లడి

మేము ఎవరిని అరెస్టు చేస్తామని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. ఇందులో రాజకీయ దురుద్దేశం లేదని రాజ్ పాకాలకు నిబంధనల మేరకే 41 నోటీసులు ఇచ్చామని కోర్టుకు ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇక విచారణలో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram