ఏపీలో ఈ ఏడాది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలుకు సిద్ధమైన కూటమి సర్కార్ ఇవాళ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు పాలనా పరమైన అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 31న దీపావళి సందర్భంగా ఈ పథకం అమలుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది. సీఎం చంద్రబాబు దీపావళి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఏపీలో ఉచిత సిలెండర్ల పథకం అమలుకు ఏటా రూ.2684.75 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో తొలి విడతలో రూ.894.92 కోట్లు విడుదల చేసేందుకు వీలుగా పాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 31న సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం ప్రారంభించగానే.. తొలి సిలెండర్ ఇళ్లకు డెలివరీ ప్రారంభం అవుతుంది. వీటికి బుకింగ్స్ రేపటి నుంచే ప్రారంభమవుతాయి. సిలెండర్ బుక్ చేసుకోగానే వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. తర్వాత ఆన్ లైన్ లో గ్యాస్ సిలెండర్ ధర రూ.876 చెల్లించాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.25 పోను రూ.851 పూర్తి రాయితీ ఇస్తారు. ఇలా ఏడాదికి 3 సిలెండర్ల వరకూ బుక్ చేసుకోవచ్చు.