E-PAPER

వైసీపీకి మరో షాక్..? జనసేనా లోకి విడుదల రజినీ..?

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు అయినప్పటికీ ఏపీలో రాజకీయ వేడి ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. 40 శాతం ఓటింగ్ షేర్ సాధించిన వైసీపీ ప్రజాక్షేత్రంలో బలంగానే కనిపిస్తోంది. అయితే వైసీపీని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే పట్టుదలతో ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి. ఈక్రమంలోనే పలువురు వైసీపీ నేతలకు అధికార పార్టీలు గాలం వేస్తున్నాయి.

 

మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఇలా చాలామంది వైసీపీకి రాజీనామా చేసి బయటకొస్తున్నారు. ఆళ్ల నాని,బాలినేని, సామినేని ,మోపిదేవి, బీదా మస్తాన రావు వంటి నేతలు ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఈ లిస్ట్‌లో మాజీ మంత్రి విడదల రజిని సైతం వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓడిపోయిన తర్వాత పార్టీలో యాక్టివ్‌గా కనిపించిన నేతల్లో విడదల రజిని కూడా ఒకరు. అయితే ఏం జరిగిందో తెలియదు .. సడన్‌గా ఆమె సైలెంట్ అయ్యారు.

 

విడదల రజిని పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఆమె నిత్యం జగన్ వెంట కనిపించేవారు. మీడియా సమావేశాల్లో సైతం తన వాయిస్‌ని వినిపించేవారు. ఎందుకో ఈ మధ్య కనిపించడం మానేశారు. విడదల రజిని జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. రజిని పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఆమె వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని సమాచారం.

 

2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి విజయం సాధించారు. స్థానిక నేత మర్రి రాజశేఖర్‌ను కాదని విడదల రజినికి టికెట్ కేటాయించారు జగన్. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ ఆమె జగన్ మంత్రివర్గంలో స్థానం లభించింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా విడదల రజినికి వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు జగన్. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి కాకుండా గుంటూర్ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆమె ఇప్పుడు పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మార్పుపై విడదల రజని వర్గం స్పందించింది. విడదల రజని వైసీపీని వీడే ప్రసక్తే లేదని, ఆమె పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. విడదల రజనికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జగన్‌‌ను కాదని ఆమె బయటకు వెళ్లరని ఆమె అనుచరులు చెబుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram