దేశవ్యాప్తంగా రెగ్యులర్ గా జరగాల్సిన జనాభా గణన కార్యక్రమాన్ని కరోనా పేరుతో వరుసగా వాయిదా వేసుకుంటూ వస్తున్న కేంద్రం ఎట్టకేలకు దీని నిర్వహణకు సిద్దమైంది. ఇప్పటికే దేశంలో జనాభా గణన చేపట్టకపోవడం, కులగణన డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనిపై రేపోమాపో అధికారిక ప్రకటన రానుంది. దీని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా చేపట్టనున్నారు.
ఇప్పటికే పదేళ్లకోసారి జరగాల్సిన జనాభా గణనను కరోనా కారణంగా నాలుగేళ్లుగా కేంద్రం వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే వచ్చే ఏడాది ప్రారంభించినా ఇది పూర్తయ్యే సరికి 2026 అవుతుందని అంచనా వేస్తున్నారు. 2026 చివరి నాటికి జనాభా గణన పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇది పూర్తి కాగానే లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టనున్నారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టాల్సిన గడువు 2026. దీంతో 2026లో దేశవ్యాప్తంగా ఒకేసారి నియోజకవర్గాల పునర్ విభజన ప్రారంభం కానుంది. ఇది 2028 వరకూ సాగుతుందని అంచనా వేస్తున్నారు. దీని తర్వాత జమిలి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. అంటే 2028లో జమిలి ఎన్నికలు ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు జనాభా గణనలో ఈసారి కూడా మత, సాంఘిక వివరాలు, ఇతర అంశాలు తప్పకుండా ఉంటాయి. అయితే కుల గణన మాత్రం ఉండే అవకాశాలు లేవు.