E-PAPER

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!

దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా సివిల్ సప్లై శాఖ తీసుకుంటున్న చర్యలపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.

 

పౌర సరఫరాల శాఖ పనితీరుపై చంద్రబాబు సమీక్షా సమావేశం

ఉండవల్లిలోని సిఎం నివాసంలో జరిగిన ఈ రివ్యూలో మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆన్లైన్ విధానంలో హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు ధరల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహించారు.

 

నిత్యావసర వస్తువుల ధరలపై అధికారులకు చంద్రబాబు సూచన

మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి తగు చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ధరల పెరుగుదల నియంత్రణ ప్రభుత్వ బాధ్యత అన్నారు సీఎం చంద్రబాబు.

 

ధరల పెరుగుదల ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటే బెస్ట్

ధరల పెరుగుదల కట్టడికి సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయని సిఎం సూచించారు. ధరలు పెరిగిన తరువాత తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలను అందించడం కంటే నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలను ముందుగానే గ్రహించి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన అమ్మకాలపై సమీక్షించిన చంద్రబాబు

నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను సిఎంకు వివరించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలకు, తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన అమ్మకాలపై సమీక్షలో వివరించారు.

 

ఇప్పటికే మార్కెట్ ధర కంటే తక్కువకే నిత్యావసరాలు

పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమోటా, ఉల్లిపాయలు రైతు బజార్ లలో కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కంటే రూ.10 నుంచి రూ.15 తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలని, వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని సిఎం అధికారులకు సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

ధరల నియంత్రణ విషయంలో చంద్రబాబు కీలక ఆదేశం

వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళికలో మన రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు కృషి చెయ్యాలన్నారు . పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు, వినియోగదారులకు కూడా న్యాయం చేయవచ్చని సిఎం సూచించారు. ధరల నియంత్రణ విషయంలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉంటేనే ప్రజలు హర్షిస్తారన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram