తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న క్రమంలో త్వరలోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మేరకు తాజాగా మాట్లాడుతూ రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. గాంధీభవన్లో మంత్రులతో కలిసి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ మేరకు రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మోడీ వ్యాఖ్యలపై తుమ్మల ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల పైన మండిపడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్రంలో 18 వేల కోట్ల రుణమాఫీ కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇప్పటివరకు రుణమాఫీ చేశారా అంటూ ప్రశ్నించారు.
హామీల అమలులో మా ప్రభుత్వమే గ్రేట్
హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే చూపించాలని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయిన బాధ ఒకరిది అయితే అధికారంలోకి రావాలనే బాధ ఇంకొకరిది అని తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. తాము నిత్యం రైతులలోనే తిరుగుతున్నామని, ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తాకేదే కదా అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రైతు భరోసా త్వరలోనే
రైతు రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని, అధికారులు సాంకేతిక సమస్యలను పరిష్కరించి రైతులకు రుణ మాఫీ అందిస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తికాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాలో వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్, బిజెపి చేస్తున్న వ్యాఖ్యలు రైతులు ఎవరూ నమ్మొద్దని తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు