కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పథకాలను గతంలో కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కూడా తీసుకువస్తున్నారు. తాజాగా ‘స్వర్ణిమ’ పేరుతో ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకంద్వారా వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్న పేద మహిలలకు రూ.2 లక్షల రుణం లభిస్తుంది. ఏడాదికి వడ్డీ కేవలం ఐదుశాతం పడుతుంది. దీనివల్ల ఆర్థికంగా వెనకబడినవర్గాలకు చెందిన మహిళలు నిలదొక్కుకునే అవకాశం ఏర్పడటమే కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పిస్తారనేది ప్రధానమంత్రి అభిప్రాయంగా ఉంది.
55 సంవత్సరాల్లోపు వయసుండాలి
జాతీయ బీసీల ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NBCFDC) ఈ పథకాన్ని పరిచయం చేస్తోంది. స్టేట్ చాన్నెలైజింగ్ ఏజెన్సీలు (SCAs) నోడల్ ఏజన్సీలుగా వ్యవహరిస్తాయి. రూ.2 లక్షల రుణం పొందే మహిళలు అంతకంటే ఎక్కువ కావాలంటే సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాలి. తాను స్థాపించదలుచుకున్న ప్రాజెక్టు వ్యయం రూ.2 లక్షల వరకు ఉండాలి. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునేవారి వయసు 18 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉండాలి. తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలైనవారే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. వారి కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
రుణం ఎంత కావాలి?
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు సైజ్ ఫొటో, కుల ధ్రువీకరణ పత్రాలు దగ్గరుండాలి. తమకు సమీపంలో ఉండే ఎస్ సీఏ కార్యాలయానికి వెళ్లాలి. అది ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు https://nsfdc.nic.in/channel-patrners/scas అడ్రస్ లో తెలుసుకోవాలి. తమకు ఎంత రుణం కావాలి? ఏ విధంగా శిక్షణ కావాలి అనే విషయాలను వివరించి చెప్పాలి. పైన చెప్పిన పత్రాలన్నింటినీ సమర్పించాలి. అధికారులు తమకు అందిన దరఖాస్తులను అన్నిరకాలు పరిశీలించిన తర్వాత అర్హులైనవారికి రుణాన్ని మంజూరు చేస్తారు.