E-PAPER

వంటశాల ప్రారంభించిన సీఎం, ఒకేసారి 1. 20 లక్షల మంది భక్తులకు..

తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన అధునాతనమైన వంటశాల‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు.తిరుమలలో కేంద్రీకృత వంటశాల‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో రూపొందించిన వంటశాల‌ 37,245 చ. అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశారు.

 

వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో, మొదటి అంతస్తులో ఆహారం తయారీ, ఆవిరి ఆధారిత వంట, ఎల్పీజీ ద్వారా నడిచే బాయిలర్లు, ఒక ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ అధునాతన వంటశాలలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కొత్త కేంద్రీకృత వంటశాల‌లో 1.20 లక్షల మంది యాత్రికులకు అన్నప్రసాదాలు తయారు చెయ్యడానికి అవకాశం ఉంది.

సుమారు 1.20 లక్షల మంది భక్తులకు పులిహోర, సాంబర్, రైస్, పొగల్, ఉప్మా సిద్ధం చేసి సీఆర్ఓ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ అన్నప్రసాదాలను సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, పీఎసీ I, రామ్ బాగీచా విశ్రాంతి భవనం వద్ద వున్న బస్ స్టాండ్, ఔటర్ క్యూ లైన్ల వెంట ఫుడ్ కౌంటర్లలో పంపిణీ చేస్తారు. అత్యాధునిక వంటశాల ఏర్పాటు చేసిన తరువాత భక్తుల రద్దీ ఎంత ఎక్కువ అయినా ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు అందించడానికి అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు అంటున్నారు.

చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడు:

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ శ్రీవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.చిన్న‌శేష వాహనం అంటే కుటుంబ శ్రేయస్సుఅని పురాణాలు చెబుతున్నాయి.

 

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. శనివారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram