E-PAPER

ధరణి పోర్టల్ రద్దు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

ధరణి పోర్టల్, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామన్నారు. అక్టోబర్ నెలకాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని, ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

 

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్‌ను గాలికి వదిలేసిందని విమర్శించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పూర్తయిన ఇళ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని మంత్రి తెలిపారు. వెంటనే మరమ్మతులు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.

 

అక్టోబర్ 7తో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుందని.. అయితే, ఈ పది నెలల్లో ప్రజలు కోరుకున్న వాటిని సాధించలేకపోయామన్నారు. రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ కార్డుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ దసరా లోపు స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. అర్హతలను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ రైతులందరికీ త్వరలోనే డబ్బులు జమ చేస్తామన్నారు.

 

మరోవైపు, లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం అనుకున్నంత వేగంగ పుంజుకోవడం లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందుకే, పురపాలక, రెవెన్యూ శాఖలే కాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని కూడా నియమించుకుని దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కొన్ని జిల్లాల్లో నీటిపారుదల శాఖ అధికారులను కూడా దరఖాస్తు పరిశీలన బృందాల్లో నియమించారు. గత నెలాఖరు వరకు సుమారు 4.50 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తియిందని, వాటిలో ఆమోదించినవి 70 వేలలోపే ఉన్నట్లు సమాచారం. పలు జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ నత్తనడకన సాగుతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram