E-PAPER

అమరావతి రైతుల ఆందోళన..!

ఏపీ రాజధాని పై ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే వారం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రుణం ఖరారు కానుంది. ఇదే సమయంలో అమరావతిలో నిర్మాణాల పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలోనే రాజధానికి భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు మాత్రం అవమానాలు తప్పటం లేదు.

 

రైతుల ఆందోళన

అమరావతిలో అసైన్డ్ రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కూటమి నేతలు ఇచ్చిన హామీలు వారికి అమలు కావటం లేదు. రాజధాని కోసం 3,139 మంది అసైన్డ్‌ రైతులు 2,689.14 ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. అప్పట్లో ఆ భూములు ప్రభుత్వానికి ఇవ్వొద్దని కొందరు వారిపై ఒత్తిడి తెచ్చినా భూములిచ్చారు. వైసీపీ హయాంలో ఆ రైతులపై సీఐడీ కేసులు పెట్టింది. ఆ భూములపై సీఐడీ విచారణకు ఆదేశించింది. అప్పటి వరకూ ఫారం- 9.14 కింద ఏడేళ్లపాటు వారికి ఇచ్చిన కౌలును, సీఐడీ విచారణ సాకుతో ఆపేసింది.

 

అందని కౌలు

సీఐడీ విచారణ పేరుతో ఆ భూములను నాట్‌ ట్యాలీడ్‌ జాబితాలో పెట్టి మూడేళ్లుగా వారికి కౌలు ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు కొంత మందిని ఆ జాబితా నుంచి తప్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమ కష్టాలు పోతాయని భావించిన ఆ రైతుల ఆశలు అడియాశలే అయ్యాయి. ఇప్పటికీ వెయ్యి కుంటుంబాలకు చెందిన 1650 ఎకరాల భూమి నాట్‌ ట్యాలీడ్‌ జాబితాలోనే ఉంది. దీంతో వారికి కౌలు రావడంలేదు. వైసీపీ ప్రభు త్వం కక్షపూరితంగా పెట్టిన సీఐడీ కేసులనే సాకుగా చూపి కౌలు చెల్లించకుండా ఆపేశారు. కూటమి ప్రభుత్వం పట్టాదారు రైతులకు కౌలు చెల్లించినా, అసైన్ట్‌ రైతుల కౌలు మాత్రం చెల్లించలేదు.

 

అధికారుల తీరుతో

ఇదే సమయంలో సీఆర్డఏ అధికారుల తీరు తో అసైన్డ్ రైతులు మనోవేదనకు గురవుతున్నారు. తమకు వారి తో అవమనాలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితి కంటే అత్యంత అమానవీయంగా అధికారుల తీరు ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. సాక్షాత్తూ సీఆర్డీఏ అదనపు కమిషనరే తమను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆక్రోశిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చినా అమలు కావటం లేదు. అమరావతి నిర్మాణం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న ఈ సమయంలో తమ సమస్యలు పరిష్కరించాలని అసైన్డ్ రైతులు కోరుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram