బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, వారి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రఘునందన్ రావు పేర్కొన్నారు.
కేటీఆర్, హరీశ్ రావుతోపాటు పలు యూట్యూబ్ ఛానల్స్‌పై కూడా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలే దుష్ప్రచారం చేస్తున్నారని, అభ్యంతరకరంగా ట్రోల్స్ చేస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని ఆయన హెచ్చరించారు. దుబ్బాక, సిద్దిపేట, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇది ఇలావుండగా, తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలసిందే. అయితే, సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తెలిపారు.
కాగా, తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో, ఫొటోలతో ట్రోల్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని ఆరోపించారు. దొంగ ఏడుపులు తనకు అవసరం లేదని కొండా సురేఖ అన్నారు.
సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. హరీశ్ రావు మనసున్న మనిషిలా స్పందించారు. నీవెందుకు రియాక్టు కాలేదు.. మనిషివి కాదా.. పశువా అంటూ కేటీఆర్ పై సంచలన విమర్శలు చేశారు. నీకు తల్లి లేదా అని ప్రశ్నించారు. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి పోస్టులు పెడుతున్నారన్నారు. మనుషుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కొంతమంది తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని సురేఖ అన్నారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే కారణమని మండిపడ్డారు కొండా సురేఖ. ఎంతోమంది సినిమా హీరోయిన్ల జీవితాతో కేటీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. దసరా పండుగ ముందు ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదన్నారు. ప్రతిదానికీ ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్.. తన మీద ట్రోల్ చేసినదానిపై ఎందుకు స్పందించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఫొటోలు మార్ఫింగ్ చేయాలనుకుంటే తాము కూడా చేయగలమని అన్నారు.