E - PAPER

E-PAPER

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు..!

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటి కాదంబరీ జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ముగ్గురు ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

 

ఈ ముగ్గురిపై ముంబై నటి వ్యవహారంతోపాటు పలు అభియోగాలున్నాయి. తప్పుడు కేసులో ముంబై నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో కీలకపాత్రధారులని చెబుతున్న నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు.

 

డీజీపీ ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబసభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై నివేదికను రూపొందించి డీజీపీకి అందజేశారు.

 

మరోవైపు, ముంబై నటి కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక, విజయవాడలో పని చేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను సస్పెండ్‌ చేశారు. తాజాగా ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్‌లు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీలపై చర్యలు తీసుకున్నారు.

 

ఇది ఇలావుండగా, ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌గున్ని, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌లపై కేసు నమోదు చేయాలని ముంబై నటి ఫిర్యాదు చేశారు. గత రెండు రోజుల పాటు తన న్యాయవాదులు పీవీజీ ఉమేష్‌ చంద్ర, పాల్‌తో కలిసి ఆమె విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు వెళ్లారు. సీఐ చంద్రశేఖర్‌కు పలు వివరాలు ఇచ్చి, ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబయి నటి ఫిర్యాదు మేరకు కుక్కల విద్యాసాగర్‌, మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram