E-PAPER

జమిలికి కేంద్రం జై..!

దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ నెల 18వ తేదీన మొదలు కాబోతోంది కూడా. దీని తరువాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.

 

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఎన్డీఏ- కాంగ్రెస్ నేతృత్వాన్ని వహిస్తోన్న ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా.. ఈ ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. విస్తృతంగా హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లల్లో పర్యటిస్తోన్నారు.

 

ఈ పరిస్థితుల్లో- రాజకీయంగా ఉత్కంఠతను రేకెత్తిస్తోన్న వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ అయిదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను నిర్వహించబోతోంది.

 

గతంలో ఈ జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫాసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలంటూ కేంద్రం ఆదేశాలను జారీ చేసినట్లు ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి.

 

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కోవింద్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న ఈ కమిటీలో మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, రాజ్యసభ మాజీ సభ్యుడు గులాంనబీ ఆజాద్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు.

 

ఈ కమిటీ తన నివేదికను ఇప్పటికే కేంద్రానికి అందజేసింది కూడా. దీనిపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించినట్లు చెబుతున్నారు. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల సందర్భంగా జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జమిలి ఎన్నికలకు జై కొట్టినట్లు చెబుతున్నారు.

 

దీనితో లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమౌతుంది. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం లేదు. తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) బలంతో మాత్రమే అధికారంలోకి రాగలిగింది.

Facebook
WhatsApp
Twitter
Telegram