E - PAPER

E-PAPER

కల్కి 2 లో నాని..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ నుంచి ఎన్నో అంచనాలను ఈ సినిమా క్రియేట్ చేసుకుంది. రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ మూడో సినిమా ‘కల్కి’తో వచ్చి ఊహించని ఘన విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది.

 

కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 50 రోజుల పాటు థియేటర్లలో రన్‌ కొనసాగించి అదరగొట్టేసింది. ప్రస్తుత కాలంలో ఇన్నిరోజుల పాటు రన్ అయ్యే సినిమా ఏది లేదనే చెప్పాలి. కానీ ఆ ఘనత కల్కి దక్కించుకోవడంతో అటు ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. జూన్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

 

ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ప్రేక్షకాభిమానుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రియుల్ని మంత్రముగ్దులను చేసింది. అంతేకాకుండా ఇందులో స్టార్ కాస్టింగ్ నటించడంతో సినిమా రేంజే మారిపోయింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో ప్రధాన పాత్రలో నటించి అదరగొట్టేశారు. అలాగే గెస్ట్ రోల్‌లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ సహా మరెంతో మంది నటించి అదరగొట్టేశారు.

 

ఇలా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో అలరించి సినిమా స్థాయిని పెంచేశారు. ఇదిలా ఉంటే దాదాపు రూ. 600 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో ఫస్ట్ పార్ట్‌కు సూపర్ డూపర్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ సీక్వెల్ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీక్వెల్‌లో కృష్ణుడి పాత్ర గురించి సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

ఈ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే దానిపై పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లోని చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. అందులో నేచురల్ స్టార్ నాని ఒకరు. అతడు ‘కల్కి 2’లో కృష్ణుడి పాత్రలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నాని రియాక్ట్ అయ్యాడు. తాజాగా ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వూలో దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. కల్కి 2లో మిమ్మల్ని శ్రీకృష్ణుడి పాత్రలో ప్రేక్షకాభిమానులు చూస్తారా? అనే ప్రశ్నకు నాని మాట్లాడుతూ.. అసలు లేదని సమాధానం ఇచ్చాడు.

 

కల్కి 2 మూవీలో కృష్ణుడి పాత్ర కంటే అర్జునుడు, కర్ణుడి పాత్రలే అత్యంత కీలకం అని అన్నాడు. ఈ సెకండ్ పార్ట్‌లో శ్రీకృష్ణుడిని చూపించమని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పినట్లు తెలిపాడు. అయినా తాను కల్కి సెకండ్ పార్ట్‌లో ఉన్నట్లు రూమర్స్ ఎలా క్రియేట్ అయ్యాయో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. అయితే దీనికీ ఓ కారణం ఉందని.. తాను ఎక్కువగా కల్కి టీంతో కలిసి కనిపించడం వల్లనే ఈ రూమర్స్ వచ్చాయని తెలిపాడు. తానెప్పుడూ అతిథి పాత్ర గురించి ఆలోచించలేదని.. ఎవరితోనూ చర్చించనూ లేదని చెప్పుకొచ్చాడు. అయితే కల్కి టీమ్‌తో వర్క్ చేసేందుకు మాత్రం చాలా ఆసక్తిగా ఉన్నానంటూ పేర్కొన్నాడు. దీని బట్టి చూస్తే నాని ‘కల్కి 2’లో నటించే అవకాశాలు ఉన్నాయని అర్థం అవుతుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram