E - PAPER

E-PAPER

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు..రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

యాదగిరిగుట్ట(యాదాద్రి) శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘స్పీడ్’ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఎస్‌ శాంతి కుమారి, మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రమేశ్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. హెల్త్‌ టూరిజంను అభివృద్ధి చేయాలన్న రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

మరోవైపు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు సమర్పించాలన్నారు.

 

ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులను అర్ధాంతరంగా ఆపవద్దని స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

 

సీఎం రేవంత్ రెడ్డికి వేములవాడ రాజన్న ఆలయ అర్చకుల ఆశీర్వచనం

 

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్లు కేటాయించినందుకు విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా, వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు. సీఎంను కలిసినవారిలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు ఉన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram