ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ పై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెలా ఒకటో తేదీన ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా రూ 4 వేల పెన్షన్ అందిస్తున్నారు. ఇదే సమయంలో ఏడాది కాలంగా అర్హత ఉండీ పెన్షన్ అందని లబ్దిదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూనే ప్రభుత్వం..అనర్హుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది.
కసరత్తు
ఏపీలో కొత్త పెన్షన్ల పంపిణీ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైసీపీ హాయంలో ప్రతీ ఏడాది జనవరి, జూన్ నెలల్లో కొత్త లబ్దిదారులను అర్హుల జాబితాలోకి చేర్చేవారు. గత ఏడాది కాలంగా అర్హత ఉన్నా..పెన్షన్ అందని లబ్దిదారులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వంలో పెన్షన్ కోసం వేచి చూస్తున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ దారులకు పెన్షన్ అందించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.
వారికి కోత
అదే సమయంలో అనర్హులకు పెన్షన్ కోత పైన కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు అందుకుంటున్నారు. అయితే, కొందరు దివ్యాంగ పెన్షన్లు నకిలీ ధృవపత్రాలతో పొందుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వారికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేస్తోంది. నకిలీ ధృవపత్రాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వానికి సెర్ప్ ఇచ్చిన నివేదిక మేరకు దాదాపు 60 వేల మందికి తిరిగి వైకల్య నిర్దారణ పరీక్షలు చేయాలని తేల్చారు.
కొత్తగా వారికి ఛాన్స్
కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా జూలై, ఆగస్టు నెలల్లో ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసారు. ఆ సమయంలో అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్లుగా గుర్తించారు. అధికారులకు ఫిర్యాదులు చేసారు. దీంతో,వారికి నోటీసులు జారీ అయ్యాయి. దివ్యాంగులు కొందరు నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు పొందటం పైన జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన తనిఖీ విధానంలోనే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు. అనర్హులను తొలిగించి..అర్హత ఉన్న కొత్త లబ్దిదారులను గుర్తించి పెన్షన్లు పంపిణీ దిశగా కసరత్తు జరుగుతోంది.