E-PAPER

సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ట్వీట్..!

భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం వున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్ట్ 29న కొన్ని పత్రికలు రాసిన కథనాలు… గౌరవనీయ న్యాయస్థానం యొక్క న్యాయపరమైన విజ్ఞతను తాను ప్రశ్నిస్తున్నాననే అభిప్రాయం తనపై కలిగేలా చేసిందనే విషయాన్ని అర్థం చేసుకోగలనని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

 

న్యాయ వ్యవస్థను తాను ఎంతో విశ్వసిస్తాననే విషయాన్ని మరోసారి గట్టిగా చెపుతున్నానని రేవంత్ అన్నారు. మీడియాలో వచ్చిన కథనాల పట్ల తాను బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. తనకు సంబంధం లేని వ్యాఖ్యలను తనకు ఆపాదించారని విమర్శించారు. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని దృఢంగా విశ్వసించే వ్యక్తిగా… న్యాయ వ్యవస్థను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని తెలిపారు.

 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బీఆర్ఎస్, బీజేపీల ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ రేవంత్ అన్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలను ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేత తరపు న్యాయవాది ప్రస్తావించగా… సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని తగ్గిస్తాయని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయాలతో తమకు సంబంధం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి న్యాయస్థానాల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పింది. న్యాయవ్యవస్థపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram