తెలంగాణ డిస్కంలో విద్యుత్ వినియోగం రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరుకున్నట్లు ట్రాన్స్‌కో సీఎండీ వెల్లడించారు. ఈ ఏడాది ఈ సీజన్‌లో 15,573 మెగావాట్లకు విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో అత్యధికంగా 14,816 మెగావాట్ల వినియోగం నమోదైందన్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఇది 5.11 శాతం అధికమన్నారు. అత్యధికంగా మార్చి 14న 308.54 మిలియన్ యూనిట్లు వినియోగించినట్లు వెల్లడించారు. ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు 266.14 మిలియన్ యూనిట్లు సరఫరా చేసినట్లు చెప్పారు. గత ఏడాది ఆగస్ట్ సమయంలో 250.25 మిలియన్ యూనిట్లు సరఫరా అయిందన్నారు.
గత ఏడాదితో పోలిస్తే 6.35 శాతం ఎక్కువ అని వెల్లడించింది. పీక్ ఖరీఫ్ సీజన్ అయిన సెప్టెంబర్, అక్టోబర్‌లో 17 వేల మెగావాట్ల వరకు డిమాండ్ ఉండవచ్చునని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు ఇతర వినియోగదారులకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు డిస్కమ్‌లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.