E-PAPER

ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్ బాత్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు…

కృష్ణాజిల్లాలోని గుడివాడ సమీపంలో గల గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు నివాసం ఉండే హాస్టల్ బాత్‌రూమ్‌లల్లో మూడో కంటికి తెలియకుండా కెమెరాలను అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

 

ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. క్యాంపస్‌లో బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, నినదాలతో ఇంజినీరింగ్ కళాశాల మార్మోగిపోయింది.

 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్‌కు చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తోన్నారు.

 

హాస్టల్ బాత్‌రూమ్‌లల్లో హిడెన్ కెమెరాలను అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థినుల వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్‌సైట్లల్లో విక్రయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తోన్నారు.

 

ఈ ఘటనపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు గానీ, జిల్లా పాలనా యంత్రాంగం నుంచి గానీ ఎవరూ బాధితులకు అండగా ఉంటామంటూ ప్రకటించలేదని తెలుస్తోంది.

 

విద్యార్థుల నిరసన ప్రదర్శలకు సంబంధించిన వీడియోలు, కొందరు విద్యార్థుల మధ్య జరిగినట్లుగా భావిస్తోన్న వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదే సమయంలో పోలీసులు కొందరు విద్యార్థుల గదుల్లోకి వెళ్లి.. వాళ్లను విచారించిన వీడియోలు సర్కులేట్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram