E - PAPER

E-PAPER

ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై ఐఎంఏ వేటు..

జూనియర్ డాక్టర్హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఐఎంఏ సస్పెండ్ చేసింది. ఐఎంఏ కోల్‌కతా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆర్డర్కాపీని విడుదల చేసింది.

 

‘హత్యాచార ఘటనను ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌వి అశోకన్ నేతృత్వంలోని కమిటీ సుమోటోగా స్వీకరించింది. ఐఎంఏ ప్రధాన కార్యదర్శితో కలిసి బాధితురాలి తల్లిదండ్రులను కలిసింది. ఆ సమయంలో సందీప్ ఘోష్తన బాధ్యతను విస్మరించారని వారు చెప్పారు. ఐఎంఏ బెంగాల్రాష్ట్ర శాఖతో పాటు కొన్ని వైద్య సంఘాలు మీ(సందీప్ ఘోష్)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అందుకే క్రమశిక్షణా చర్యల కమిటీ మీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది’ అని ఆర్డర్కాపీలో ఐఎంఏ వెల్లడించింది.

ఇది ఇలావుండా, జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా కోల్‌కతా పోలీసు విభాగానికి చెందిన ఏఎస్ఐ అనూప్ దత్తాకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. హత్యాచారానికి పాల్పడిన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు, అనూప్ దత్తాకు మధ్య ఉన్న సంబంధాలను తెలుసుకునేందుకు లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

 

కోల్‌కతా పోలీసుల సంక్షేమ కమిటీలో పనిచేసిన అనూప్ దత్తా.. ట్రాఫిక్ పోలీసు వాలంటీర్‌గా పనిచేసిన సంజయ్‌ రాయ్‌కు గతంలో అనేక సార్లు సహాయపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యాచారం గురించి నిందితుడు దత్తాకు సమాచారమిచ్చి, నేరం నుంచి తప్పించుకునేందుకు ఏమైనా సహాయం కోరాడా? అని తెలుసుకునేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు. మరోవైపు, వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపునివ్వగా.. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ బీజేపీ నేత వాహనంపై కాల్పులు జరపడం కలకలం రేపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram