ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు నేతలు పార్టీ మారేందుకు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పి చెప్పి అధికార పక్షంలో చేరాలని ప్రయత్నాలు చేస్తుంటే తాజాగా వైసిపి ఎమ్మెల్సీ పోతుల సునీత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
వైసీపీకి పోతుల సునీత గుడ్ బై
దీంతో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలినట్టు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరికి కీలక నేతలు గుడ్ బై చెప్పి టిడిపిలోకి, జనసేనలోకి వెళతారు అని ప్రచారం జరుగుతున్న వేళ ఊహించని విధంగా వైసిపి ఎమ్మెల్సీ పోతుల సునీత వైసిపి కి గుడ్ బై చెప్పారు.
జగన్ కు పోతుల సునీత రాజీనామా లేఖ
వైసిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సునీత పార్టీ సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైయస్ జగన్ కు కూడా పంపినట్టు తెలుస్తుంది. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఇదిలా ఉంటే వైసిపికి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయనకంటే ముందే పోతుల సునీత రాజీనామా చేయడం గమనార్హం.
వైసీపీలో సునీత ప్రస్తానం ఇలా
బాపట్ల జిల్లా చీరాలకు చెందిన పోతుల సునీత 2017 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల తర్వాత మరో మూడేళ్లు సమయం ఉండగానే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అయితే 2021లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ పదవీకాలం 2023 మార్చితో ముగియనుండగా మరో మారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
సునీత చేరేది ఆ పార్టీలోనేనా?
ఇన్నిసార్లు జగన్ సునీతకు అవకాశం ఇచ్చినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ అధికారంలో లేకపోవడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మంగళవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏలూరు మేయర్ దంపతులతో పాటు కీలక నేతలు రాజీనామా చేశారు . తాజాగా పోతుల సునీత కూడా రాజీనామా చేయడంతో సునీత ఏ పార్టీలో చేరబోతున్నారు అన్నదానిపైన ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది .గతంలో ఆమె టిడిపిలో పనిచేయడంతో మళ్ళీ టిడిపిలోకి వెళతారా అన్నది ఆసక్తిగా మారింది.