E-PAPER

కొత్త కారు కొనుగోలుపై డిస్కౌంట్..కండీషన్స్ అప్లయ్..!

మీకు ఇప్పటికే ఒక వాహనం ఉందా.. కొని చాలా కాలం అయ్యిందా.. మరో కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. మీరు కొనబోయే కొత్త వాహనంపై భారీ డిస్కౌంట్ పొందొచ్చు. బట్ కండీషన్స్ అప్లయ్. అవును ఈ వార్త చెప్పింది మరెవరో కాదు.. కేంద్ర రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కరీ. ఇంతకీ నితిన్ గడ్కరీ చెప్పింది ఏంటి.. వాహనంపై డిస్కౌంట్ పొందాలంటే ఎలాంటి షరతులు ఉన్నాయి..?

 

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే పాత వాహనం ఉండి అది స్క్రాప్‌కు సమర్పించి చెల్లుబాటులో ఉండే డిపాజిట్ సర్టిఫికేట్ చూపిస్తే కొత్త వాహనం కొనుగోలుపై డిస్కౌంట్ ఇస్తారని గడ్కరీ తెలిపారు. ఈ ఆఫర్ ఇటు కమర్షియల్ అటు ప్యాసింజర్ వాహనాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇదే విషయమై తాను పొందుపర్చిన ప్రతిపాదనకు కమర్షియల్ మరియు ప్యాసింజర్ వాహనాల తయారీదారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. కొత్త వాహనాలపై డిస్కౌంట్ ఇచ్చేందుకు వారు అంగీకారం తెలిపారని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ చొరవతో రోడ్లు స్వచ్ఛంగా ఉండటంతో పాటు కాలుష్యం తగ్గుముఖం పట్టడమే కాకుండా, సమర్థవంతమైన, సురక్షితమైన వాహనాలు రోడ్లపై తిరుగుతాయని మంత్రి అన్నారు.

 

అంతకుముందు సియాం(SIAM) సీఈఓలతో భేటీ అయిన గడ్కరీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. దేశంలో 1000 వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాలు, 400 ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ సెంటర్లు అవసరమని గతేడాది నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. మంగళవారం జరిగిన సమావేశంలో గడ్కరీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీతో అన్ని రంగాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డ మంత్రి… దక్షిణాసియాలో భారత్ స్క్రాపింగ్ హబ్‌గా నిలుస్తుందని అన్నారు.సర్క్యులర్ ఎకానమి చాలా ముఖ్యమైనదని భవిష్యత్తులో దేశంలో చాలా ఉద్యోగాలు కల్పించబోతున్నామని చెప్పారు.

 

2021 ఆగష్టులో మోదీ ప్రభుత్వం నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించారు. కాలుష్యం వెదజల్లే వాహనాలను దశలవారీగా తొలగించడంలో సహాయపడుతూ, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడంలో ఈ విధానం ఉపయోగకరంగా మారుతోంది. తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం పాత వాహనాలను రద్దు చేసిన తర్వాత కొనుగోలు చేసే వాహనాలకు ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రోడ్ టాక్స్‌ పై 25శాతం వరకు రాయితీని కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. వాహన స్క్రాపేజ్ పాలసీ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉంది.

 

కేంద్రం 2021 -22 బడ్జెట్‌లో స్క్రాపేజ్ పాలసీ గురించి ప్రస్తావించింది. ఈ విధానం కింద వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించాలి, కమర్షియల్ వాహనాలకు 15 సంవత్సరాలు పూర్తయ్యాక ఫిట్‌నెస్ టెస్టు తప్పక చేయించాలని పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram