ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని తేల్చేసారు. తన మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడటమేనని, పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. కవిత బెయిల్ గురించి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ – బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు.
ఇక్కడే పరిమితం
హైడ్రా హైదరాబాద్ కే పరిమితం అవుతుందని రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, చెరువులు నాళాలపై కూల్చివేతలకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిబంధనలు పాటించని భవనాలను కూల్చివేస్తాం. తొలి కూల్చవేత మొదలుపెట్టిందే కాంగ్రెస్ నేత పల్లం రాజు నుంచి అని వివరించారు. కేటీఆర్ ఫామ్ హౌస్‌కి అనుమతి సర్పంచి నుంచి తీసుకున్నాం అని అంటున్నారన్నారు. సర్పంచ్ ఎలాంటి అధికారిక అనుమతులు ఇవ్వరని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు జరుగుతున్నాయని స్పష్టం చేసారు.
బెయిల్ ఎలా
కేవలం ఐదు నెలల్లో కవితకు బెయిల్ ఎలా వచ్చిందని సందేహం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు సమయం పట్టిందని, సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిల్ రాలేదని ఆయన ప్రస్తావించారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేసిందని, 8 సీట్లలో బీజేపీ గెలవడానికి హరీష్ రావు పనిచేశారని విమర్శించారు. బీజేపీ – బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని రేవంత్ వ్యాఖ్యానించారు.
దమ్ముంటే రావాలి
తన కుటుంబ సభ్యులకు చెందిన అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలు తీసుకుని రావలని రేవంత్ సూచించారు. తాను కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అని ఆధారాలతో అక్కడికి వెళ్లానన్నారు. కేటీఆర్‌కి దమ్ముంటే తన కుటుంబ సభ్యులు లేదా తనవి అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలతో రావాలని సవాల్ చేసారు. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్జీటీ మార్గదర్శకాలను పాటిస్తున్నామని చెప్పారు. చెరువులు, కుంటలలో కొన్ని భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. సెక్రటేరియెట్, జీహెచ్ఎంసీ లాంటి భవనాలరగ సుప్రీంకోర్టు అనుమతి ఉందని రేవంత్ స్పష్టం చేసారు