ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కవితకు బెయిల్ వచ్చిందన్న వార్తలు బయటకు రాగానే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లేదా కేసీఆర్ టార్గెట్‌గా సోషల్ మీడియాలో పోస్టింగుల మీద పోస్టింగులు పెట్టారు. కొందరు నేతలైతే మీడియా సమావేశం పెట్టి మరీ బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ రహస్య ఒప్పందం మేరకే కవితకు బెయిల్ వచ్చిందని దీని వెనుక కథను కేసీఆర్ నడిపారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలి తరపున వాదించిన అభిషేక్ సింఘ్వీని కాంగ్రెస్ రాజ్యసభకు పంపిందని ఇద్దరూ మంచి టచ్‌లో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
ఇక వీరిద్దరికీ గట్టిగానే కౌంటరిస్తూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ పోస్టులు పెట్టారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న కాంగ్రెస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.కాంగ్రెస్ అగ్రనేతలకు కూడా పలు కేసుల్లో బెయిల్ వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. డిసెంబర్ 2015లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఉన్న ఈడీ కేసుల్లో వారికి బెయిల్ వచ్చిందని గుర్తు చేసిన కేటీఆర్…ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాకు కూడా వారం రోజుల క్రితమే బెయిల్ మంజూరైందని చెప్పారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో నిందితుడిగ ఉండగా 2015 నుంచి ఆయన బెయిల్ పై ఉన్నారంటూ స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చారు. వీరందరికీ ఎన్డీయే ప్రభుత్వంలోనే బెయిల్ వచ్చిందన్న కేటీఆర్.. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని అనుకోవచ్చా అంటూ ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించాలని కేటీఆర్ కోరారు. ఇదిలా ఉంటే మంగళవారం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే ప్రక్రియ ప్రారంభమైందనే వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ కేంద్రంగా బీజేపీ అగ్రనాయకులతో చర్చలు జరిపారని ఆ చర్చలు ఫలించగాన కవితకు బెయిల్ వచ్చేందుకు ఈడీ సహకరించిందని అన్నారు. కవితకు ఇప్పుడే బెయిల్ ఎలా వచ్చిందనే అంశంపై లోతుగా విశ్లేషిస్తే బీజేపీ బీఆర్ఎస్‌ల రహస్య ఒప్పందం గురించి స్పష్టమవుతుందని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈ ఏడాది మార్చి 15వ తేదీన అరెస్టు అయ్యారు. దాదాపుగా 161 రోజులు జైలు జీవితం గడిపిన ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత ధర్మాసనం.