ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో రద్దు, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రద్దు వంటి నిర్ణయాలు ఉన్నాయి.
వీటితో పాటు ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన, పోలవరం ప్రస్తుత కాంట్రాక్టర్ కొనసాగింపు, పనుల పునః ప్రారంభం వంటి మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి.
ఇవాళ తొలిసారి ఈ-కేబినెట్ విధానంలో సమావేశమైన మంత్రివర్గం కాగిత రహితంగానే సాగుతోంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమలు చేసిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులను సమీక్షించి డబ్బుల ఆదా పేరుతో అమలు చేసిన ఈ విధానానికి చరమగీతం పాడుతూ ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత టెండర్ల విధానం ప్రకారమే పనులు కేటాయించాలని నిర్ణయించింది.
అలాగే రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాల నియంత్రణ కోసం గత వైసీపీ సర్కార్ తెచ్చిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల పాటు సాగిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు వాడుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేబినెట్ దీన్ని రద్దు చేసింది. దీని స్ధానంలో రెగ్యులర్ పోలీసులు, విజిలెన్స్ మాత్రం ఇకపై ఈ అక్రమాలను నియంత్రిస్తారు.
మరోవైపు కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం నియమించిన కాంటాక్టర్ మేఘా ఇంజనీరింగ్ నే కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. అటు వివాదాస్పద భూముల్లో రెజిస్ట్రేషన్లను నిలిపేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది.