మలయాళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం హాట్ టాపిక్ గా అక్కడి సినీ పెద్దలను కుదిపేస్తోంది. అక్కడ మీటూ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ తన నివేదికను అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీనితో కొందరు నటులు ఇప్పుడిప్పుడే జరిగిన వాస్తవాలపై తమ అనుభవాలపై స్పందిస్తున్నారు. నటి మిను మునీర్ తనని శారీరకంగా లైంగిక వేధింపులకు గురిచేశారని నటుడు ముఖేశ్ జయసూర్య, మునియన్పిళ్ల రాజు, ఇదవేళ బాబు తదితరులపై ఆరోపణలు చేశారు. తమపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిఖ్ తమ ఏఎంఎఏ పదవులకు రాజీనామా చేశారు ఇప్పటికే. ఇప్పుడు మరికొందరు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తున్నారు.
హేమ కమిటీకి హ్యాట్సాఫ్
గతంలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సింగర్ చిన్మయి శ్రీపాద. రీసెంట్ గా మలయాళ చిత్ర రంగానికి సంబంధించిన క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నియమించిన హేమ కమిటీ ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై స్పందించిన చిన్మయి క్యాస్టింగ్ కౌచ్ గురించి మరింత సమగ్ర సమాచారం ఇచ్చారు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాకు. ముందుగా హేమ కమిటీ సభ్యులు, డబ్లూసీసీ సభ్యులకు సింగర్ చిన్మయి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని గతంలోనూ ఇది ఉండేదని అన్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఫిర్యాదు చేసినా గతంలో ఫలితం ఉండేది కాదని..నిందితులు తమ రాజకీయ పలుకుబడితో తప్పించుకు తిరుగుతారని అన్నారు.
సినీ పెద్దలకు భయపడి..
ఒక వేళ ఎవరైనా ఎదురుతిరిగితే వాళ్లను సినీ పరిశ్రమనుంచి ఎలాంటి సహాయసహకారాలు ఉండకుండా చేస్తారని తెలిపారు.అందుకే చాలా మంది తమకు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని భయపడి లైంగిక వేధింపులపై ఎలాంటి ఫిర్యాదులూ చేసేవారు కాదు. ఇకనైనా ధైర్యంగా ముందుకు వచ్చి లైంగిక వేధింపులపై స్పందిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నానని చిన్మయి అన్నారు. గతంలో తాను కూడా వైరముత్తు అనే తమిళ లిరిక్ రైటర్ నుంచి లైంగిక వేధింపులు అనుభవించానని చెప్పారు. ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించిన దానిపై తాను పోరాడుతునే ఉన్నానని అన్నారు. సినిమా పరిశ్రమకూ నేరస్థులకు మధ్య అనుబంధాలు ఉంటాయని ..ఆ నేరస్థులకు కూడా రాజకీయ నేపథ్యం ఉంటుందని ప్రధానంగా వీరి ప్రమేయంతోనే క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుంటుంది అన్నారామె. రాజకీయ అండతో నేరస్తులు తప్పించుకు తిరుగుతుంటారని అన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో మాఫియా
కొందరు ఫైనాన్సర్లు నిర్మాతలకు ఫలానా హీరోయిన్ నే పెట్టుకోవాలని..అప్పుడే తాము ఆ సినిమాకు ఫైనాన్స్ చేస్తామని చెబుతుంటారు. అలాగే మరికొందరిని ఆ సినిమాలో తీసుకోవద్దని మొత్తం వాళ్లే నిర్ణయిస్తుంటారు. ఒకప్పుడు ముంబాయి సినీ మాఫియా సామ్రాజ్యంలో యథేచ్ఛగా జరిగే క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ప్రస్తుతం అన్ని భాషల సినీ పరిశ్రమలలో కామన్ గా జరుగుతున్నాయని చిన్మయి ధ్వజమెత్తారు. అయితే ఇప్పటికైనా తమపై జరిగిన లైంగిక వేధింపులపై బహిరంగంగా బయటకొచ్చి చెప్పుకుంటున్న నటీమణులను చిన్మయి ప్రత్యేకంగా అభినందించారు.