ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన చెత్త పన్ను వసూళ్లను కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే నిలిపేసింది. పట్టణాల్లో చెత్త పన్ను వసూళ్లపై ప్రజాగ్రహాన్ని గమనించి కూటమి సర్కార్ దీన్ని రాష్ట్రవ్యాప్తంగా నిలివేసింది. అయినా చెత్త పన్ను చెల్లింంచాల్సిందేనంటూ కడప మేయర్ సురేష్ బాబు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. వీటిపై ఆగ్రహంతో జనం
ఏకంగా తమ ఇంట్లో చెత్తను తీసుకొచ్చి మేయర్ ఇంట్లో పారేశారు.
కడపతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్దానిక సంస్థల పరిధిలో చెత్త పన్ను వసూళ్లను నిలిపేస్తూ కూటమి సర్కార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను వసూల్లు నిలిచిపోయాయి.కానీ కడపలో మాత్రం మేయర్ సురేశ్ బాబు స్థానికంగా చెత్త పన్ను చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. పన్ను చెల్లించకపోతే ఇళ్ల నుంచి చెత్త సేకరణ చేయొద్దని ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో ఈ ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి.
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మేయర్ సురేశ్ బాబు ఇచ్చిన ఆదేశాలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి మండిపడుతున్నారు. చెత్త పన్ను చెల్లించవద్దని ప్రజలను ఆమె కోరారు. దీంతో స్థానికులు చెత్త పన్ను చెల్లించడం మానేశారు. దీంతో మేయర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణను కూడా నిలిపేశారు. దీంతో ఇబ్బందులు పడుతున్న జనం ఆగ్రహంతో ఆ చెత్తను తీసుకెళ్లి మేయర్ ఇంట్లో పడేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి.