ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత భవిష్యత్ నేడు తేలిపోనుంది. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించబోతోంది. దీనితో అందరి కళ్లూ దీని మీదే నిలిచాయి.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. వాటన్నింటినీ ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చింది. జ్యుడీషియల్ కస్టడీని ఎప్పటికప్సుడు పొడిగించింది. ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ వచ్చింది ఢిల్లీ కోర్టు. బెయిల్ పిటీషన్లపై సానుకూలంగా స్పందించలేదు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నేడు విచారణ చేపట్టనుంది. ఇదే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీష్ రావు.. కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. బెయిల్ పిటీషన్‌పై వాదనలను స్వయంగా తిలకించనున్నారు. బెయిల్ లభించవచ్చనే ఉద్దేశంతో కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వచ్చారని అంటున్నారు.