రాష్ట్రంలో ఎల్ ఆర్ఎస్ అమలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎందుకు డబ్బులు వసూలు చేస్తోందని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు.
రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ను పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని హరీష్ రావు కోరారు.
ప్రజల రక్త మాంసాలు పీల్చేందుకే
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారని గుర్తు చేసిన హరీష్ రావు రాష్ట్రంలో ప్రజల పరిస్థితుల పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ అధికారులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ అధికారులకు టార్గెట్స్ పెట్టి మరీ ప్రభుత్వం 15000కోట్లు వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది అంటే ప్రజల రక్త మాంసాలను పీల్చడమేనని ఆయన విమర్శలు గుప్పించారు
ప్రజలు ఒక్కరూపాయి కూడా కట్టొద్దు
ప్రజలు ఎవరు ఒక్క రూపాయి కూడా ఎల్ ఆర్ ఎస్ చెల్లించవద్దని హరీష్ రావు సూచించారు. ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు అధికార యంత్రాంగం మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేస్తుందని మండిపడ్డారు. ప్రజలకు రోజు ఫోన్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
నాడు ఫ్రీ ఫ్రీ… ఇప్పుడు ఫీజు ఫీజు
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల వద్ద నుండి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు. నాడు ఫ్రీ ఫ్రీ అని హామీలు ఇచ్చి ఇప్పుడు ఫీజు ఫీజు అంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
ఎల్ఆర్ఎస్ ఫీజుల కోసం ప్రజల వెంట పడటం సమంజసం కాదు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రుణమాఫీ కాక, రైతుబంధు రాక రైతులు ఆవేదనలో ఉన్నారని మరోవైపు విషజ్వరాలతో సామాన్య ప్రజలు ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని ఇలాంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం అది విడిచిపెట్టి ఎల్ఆర్ఎస్ ఫీజుల కోసం ప్రజల వెంట పడటం ఎంత మాత్రం సమంజసం కాదని హరీష్ రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ మెడలు వంచుదాం
తాము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తో పాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క తదితరులు ఎల్ ఆర్ ఎస్ కు డబ్బులు వసూలు చేయొద్దని మీడియా ముందు చెప్పి మరీ, ఇప్పుడు ఎలా వసూళ్లకు దిగారని నిలదీశారు. ఇచ్చిన మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఏ ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఎల్ ఆర్ ఎస్ ఫీజు చెల్లించవద్దని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే బాధ్యతను తాము తీసుకుంటామని ఆయన చెప్పారు.