తెలంగాణ రాజకీయలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రైతు రుణమాపీ పైన ప్రభుత్వం పై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. హైడ్రా కూల్చివేతల అంశం రాజకీయాన్ని వేడెక్కింది. అటు టీపీసీసీ చీఫ్ ఎవరనేది ఈ రోజు ఏఐసీసీ ప్రకటన చేయనుంది. మంత్రివర్గ విస్తరణ పైనా కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలోనే మాజీ మంత్రి కేటీఆర్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
ఢిల్లీ టూర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను తీసుకెళ్తున్నారు. ఈ సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు. కేటీఆర్ తో పాటుగా ఏకంగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వెళ్లటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ ఏం చేయబోతున్నారు..ఎవరిని కలుస్తారనేది కొత్త చర్చగా మారింది. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది.
కవిత బెయిల్
అయితే, కేటీఆర్ పర్యటన గురించి ఆసక్తి కర సమాచారం బయటకు వస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయిదు నెలల కాలంలో జైలులో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ అన్ని చోట్లా ఎదురు దెబ్బలే తగిలాయి. ఈ నెల 27 (మంగళవారం) సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన బృందంతో ఢిల్లీకి పయనమవుతున్నారు.
ఢిల్లీ కేంద్రంగా
ఈ సారి సుప్రీంలో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఈ నమ్మకంతోనే కేటీఆర్ తనతోపాటు 20 మంది ఎమ్మెల్యేలను హస్తినకు తీసుకెళ్తున్నారని చర్చ జరుగుతోంది. జైలులో సుదీర్ఘంగా ఉన్న కారణంగా కవిత అస్వస్థతకు గురవుతున్నారని ఇప్పటికే న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. కవితకు బెయిల్ పైన ఉత్కంఠ వేళ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో మకాం వేస్తున్నారు. అదే సమయంలో బెయిల్ రాకపోతే ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ మరో ఆలోచనతో ఉన్నారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.