హైదరాబాద్లో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా పైన రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది.
తెలంగాణాలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఇక హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది.
వరంగల్ వాడ్రా.. కరీంనగర్ కాడ్రా
నిన్నటికి నిన్న వరంగల్లో అక్రమ నిర్మాణాలకు కూల్చివేతకు వాడ్రాను ఏర్పాటు చేయాలని కొందరు భావిస్తే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఆ విషయాన్నీ వెల్లడిస్తే, ఇక తాజాగా కాడ్రా ఏర్పాటు చేయాలని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చెరువులను పరిరక్షించాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ నేతలు సైతం సన్నాహాలు మొదలుపెట్టారు.
కరీంనగర్ లో చెరువుల కబ్జాలు
గత ప్రభుత్వ హయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు కబ్జాలకు గురయ్యాయి. కరీంనగర్ శివారులో పాతికేళ్ల క్రితం పదుల సంఖ్యలో చెరువులు కుంటలు ఉండేవి. అయితే ఎల్ ఎం డి రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగాయి.
గత ప్రభుత్వ హయాంలో జోరుగా ఆక్రమణలు
గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన పాలకులు నాయకులే దగ్గరుండి మరీ ప్రభుత్వ భూముల కబ్జాలో ప్రధాన పాత్ర పోషించారని విమర్శలు ఉన్నాయి. పేదల భూములను సైతం కబ్జా చేసి జలగల్లాగా పట్టిపీడించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
రేవంత్ ను కలిసి కాడ్రా ఏర్పాటుకు విజ్ఞప్తి
అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆక్రమణల విషయంలో చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకుని ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైదరాబాద్లో హైడ్రాతో రంగంలోకి దిగడంతో కరీంనగర్ లో కూడా అటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కరీంనగర్ వాసులు, కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు. త్వరలోనే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి మేరకు విజ్ఞప్తి చేస్తామని అంటున్నారు.
హైడ్రా కూల్చివేతలపర్వంతో ప్రజల ఆలోచన ఇలా
అక్రమ నిర్మాణాలు భూకబ్జాలపై ఉక్కు పాదం మోపి ప్రభుత్వ భూములను చెరువులను కాపాడుతామని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రస్తుత హైడ్రా కూల్చివేతలపర్వం రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. కరీంనగర్లో కాడ్రా ఏర్పాటు చేసి భూ అక్రమార్కుల భరతం పట్టాలని కోరుతున్నారు.