సచివాలయాల విధులు ఏంటి. భవిష్యత్ ఎలా ఉంటుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ చర్చ మొదలైంది. జగన్ హయాంలో ఏర్పాటైన సచివాలయాలు..వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. రెండు వ్యవస్థలను కొనసాగిస్తూనే మార్పులు చేస్తామని చెబుతోంది. అయితే, ఇప్పుడు కీలకమైన సంక్షేమ పథకాల నిర్వహణ బాధ్యతల నుంచి సచివాలయాలను తప్పించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆర్టీజీఎస్ కు బాధ్యతలు
గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల నిర్వహణ..పంపిణీ పూర్తిగా సచివాలయ – వాలంటీర్ల పరిధిలో నిర్వహించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల సేవల ైన ఇంకా పూర్తి నిర్ణయం చేయలేదు. రెండు నెలలుగా వారికి జీతాలు లేవు. ఇక,సచివాలయ ఉద్యోగుల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తుంది. ఇప్పటి వరకు సచివాలయాలు పర్యవేక్షించిన సంక్షేమ పథకాల నిర్వహణను ఇక నుంచి ఆర్టీజీఎస్ కు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014-19 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆర్టీజీసీఎస్ వ్యవస్థ తీసుకొచ్చారు.
అనుసంధానం
రాష్ట్రంలోనీ ప్రతీ ప్రాంతంతోనూ ఈ వ్యవస్థ అనుసంధానం అయి ఉంది. క్షేత్ర స్థాయిలో విపత్తుల నుంచి సాయం వరకు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదించేది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్న ప్రతీ ఇంటికి సంబంధించి ఇప్పటికే ఈ వ్యవస్థ వద్ద పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థలోని సిబ్బంది ప్రభుత్వంలోని అన్ని శాఖలతో అనుసంధానం అయి ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పథకాల లబ్దిదారుల ఎంపిక నుంచి అమలు వరకు బాధ్యతలు కేటాయించింది.
ప్రభుత్వం కసరత్తు
కానీ, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల బాధ్యతలను సచివాలయ వ్యవస్థ నుంచి తప్పించి ఆర్టీజీఎస్ కు అప్పగించేలా కసరత్తు చేస్తోంది. ఆర్టీజీఎస్ ను మరిత బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీంతో, సచివాలయాల కొనసాగింపు వాటి బాధ్యతల పైన చర్చ మొదలైంది. సచివాలయ వ్యవస్థను పంచాయితీ రాజ్ శాఖలో విలీనం చేస్తారనే ప్రచారం ఉంది. ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం సచివాలయ శాఖ కొనసాగుతుందని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు పై ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.