E-PAPER

మరోసారి వైసీపీ కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ లో మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ..ప్రజలతో దూరం పెరగటం జగన్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. వచ్చిన వారికి సమయం కేటాయిస్తున్నారు. ఇదే సమయంలో మరోసారి జగన్ తో కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకు రావటం సంచలనంగా మారుతోంది.

 

రంగంలోకి పీకే

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతోంది. 2019 ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రచారంలో మార్పులు..హామీలు.. ప్రజలతో మమేకం కావటం పైన సూచనలు చేసారు. ఆ సమయంలో అభ్యర్దుల ఎంపికలోనూ కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్ కు దూరం అయ్యారు. ఆ తరువాత నాడు ప్రశాంత్ కిషోర్ తో కలిసి జగన్ కోసం పని చేసిన రిషి రాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు తన టీంతో పని చేసారు.

వైసీపీ కోసం నాడు

2024 ఎన్నికల కోసం చాలా రోజులుగా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడు రాబిన్ శర్మ, శంతన్ టీడీపీ కి పని చేసారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం, వ్యూహాలను సూచించారు. అయితే, జగన్ గెలుపులో 2019 లో కీలకంగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చి సమావేశం అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగానూ సమావేశాలు జరిగాయి. జగన్ కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే వాదన ఉంది. ఇక, ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ కు మద్దతుగా పని చేసిన ఐ ప్యాక్ ప్యాకప్ అయింది.

జగన్ సిద్దమేనా

ఇప్పుడు జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు లేదంటే బెంగళూరులో సేద తీరుతున్నారు. ఈ సమయంలోనే జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనతో తిరిగి ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ కోసం పని చేయాలనే సూచన వచ్చింది. జగన్ వద్ద ఈ ప్రతిపాదన రాగా..అందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ నేతల సమాచారం. ఈ సమయంలోనే నేరుగా జగన్ ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేసారని తెలుస్తోంది. జగన్ తరువాత కలుద్దామంటూ వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ కోసం వ్యూహకర్తల టీం పని చేస్తుండటంతో..జగన్ కోసం మరోసారి నేరుగా పని చేయకపోయినా.. ప్రశాంత్ కిషోర్ సూచనలు..సలహాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. దీని పైన ప్రశాంత్ కిషోర్ స్పందన పైన స్పష్టత రావాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram