E-PAPER

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పై భారీ ట్విస్ట్..!

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీకి రైల్వే జోన్ హామీ పెండింగ్ లో ఉంది. తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పైన రైల్వే మంత్రి కీలక ప్రకటన చేసారు. కానీ, ఇప్పుడు విశాఖకు జోన్‌ ఇవ్వకుండానే ఒడిశాలోని రాయగడకు డివిజన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీంతో వాల్తేరు డివిజన్ రద్దు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త రైల్వే జోన్ ఏర్పాటులో కీలక మలుపుగా మారింది.

 

తాజా నిర్ణయంతో

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పైన ఎప్పటికప్పుడు కేంద్రం సానుకూలంగా స్పందిస్తూ వస్తోంది. 2020-21 బడ్జెట్‌లోనే జోన్‌ కార్యాలయం నిర్మాణానికి నిధులు కేటాయించారు. అయితే జోనల్‌ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూములు ఏపీలో గత ప్రభుత్వం ఇవ్వడం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గతంలో అనేకసార్లు ఆరోపించారు. తాజాగా జోన్‌ సమస్యలు పరిష్కారం అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఇటీవల తెలిపారు. తాజాగా రైల్వే శాఖ విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్‌ పనులు ముమ్మరం చేస్తోంది.

 

రాయగడ డివిజన్‌

తూర్పు కోస్తా రైల్వే కొత్తగా ఏర్పాటు చేయబోయే రాయగడ డివిజన్‌ కోసం రాయగడలో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం, సిబ్బందికి క్వార్టర్లు, సర్వీసు భవనం నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించింది. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర వాసుల్లో కొత్త సందేహాలకు కారణంగా నిలుస్తోంది.విశాఖలో కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తే వాల్తేరు డివిజన్‌లో ఉన్న కొన్ని ప్రాంతాలను తీసేసి, అటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా రాయగడ డివిజన్‌ ఏర్పాటు చేయాలనేది ఓ ప్రతిపాదన. కొత్త డివిజన్‌ ఏర్పాటు చేసినట్టు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

.

వాల్తేరు రద్దు దిశగా

తాజాగా రాయగడలో డీఆర్‌ఎం కార్యాలయ సముదాయం నిర్మాణానికి సెప్టెంబరు 24లోగా టెండర్లు సమర్పించాలని ప్రకటించారు. అంటే రాయగడ డివిజన్‌ ఏర్పాటు, వాల్తేరు డివిజన్‌లో కొన్ని ప్రాంతాలను అందులో కలపడం ఖాయమని తేలిపోయింది. అయితే వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్‌ కావాలని విశాఖ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీకి చెందిన ఎంపీలు సైతం ఇదే ప్రతిపాదన పైన ఢిల్లీ పెద్దలతో చర్చించారు. ఒడిశాకు సంబంధించిన ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్న రైల్వే పెద్దలు విశాఖ జోన్‌ విషయంలో లేకపోవటం కొత్త సందేహాలకు కారణం అవుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram