టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మాస్ మహారాజ ప్రస్తుతం ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే అతడికి హిట్ పడి చాలా కాలమే అయింది. గతేడాది టైగర్ నాగేశ్వర రావు, రావణాసుర వంటి సినిమాలు తీశాడు. కానీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇక ఈ ఏడాదిలో ఈగల్ మూవీ చేశాడు. ఫస్ట్ నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నా.. రిలీజ్ అనంతరం బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ గానే మిగిలింది. ఈ సినిమా కూడా పెద్దగా ఎవరికి ఎక్కలేదు. అయితే తన సహనాన్ని ఎక్కడా కోల్పోకుండా విజయపజయాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు తీస్తునే ఉన్నాడు.
ఈ సారి ఎలా అయినా పెద్ద హిట్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో ఒక భారీ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్‌తో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మిరపకాయ్’ ఎలాంటి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ కాంబో ఇప్పుడు మళ్లీ వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అంతేకాకుండా ‘గబ్బర్ సింగ్’ సినిమాతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోకి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇప్పుడు మాస్ మహారాజకి కూడా మంచి హిట్ అందిస్తాడని అంతా భావిస్తున్నారు.
అందువల్లనే ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’పై ఫుల్ బజ్ ఏర్పడింది. ఇందులో భాగంగానే ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ అండ్ భాగ్యశ్రీ బోర్సే జోడీ చాలా బాగుందని.. హీరోయిన్ క్యూట్‌నెస్ అందరికీ అట్రాక్ట్ చేసే విధంగా ఉందని పలువురు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెట్టారు. మొత్తంగా సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ అప్డేట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ హై స్పీడ్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో రవితేజ బిజీ బిజీగా ఉంటూనే.. మరోవైపు మరికొన్ని స్టోరీలను వింటున్నట్లు తాజాగా టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలోనే ఓ యంగ్ అండ్ క్రేజీ డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బాబి.. ఇటీవల ఓ చిన్న పాయింట్‌ను రవితేజకు చెప్పగా అది నచ్చి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘పవర్’ సినిమా వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబో సెట్ అయ్యే సూచనలు ఉండటంతో ఈ సారి మామూలుగా ఉండదని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇది రవితేజ కెరీర్‌లో 75వ సినిమాగా రూపొందనుంది. ప్రస్తుతం దర్శకుడు బాబీ.. బాలయ్య బాబుతో ‘NBK 109’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రవితేజతో కొత్త సినిమా పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ కూడా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చిత్రీకరణ త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.