E-PAPER

గౌడన్నలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. ‘కాటమయ్య రక్ష’ కిట్లు..

గీత కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గౌడన్నల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు గీసే సమయంలో చెట్టు ఎక్కిన తర్వాత ప్రమాదవశాత్తు చాలా మంది గీత కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. చెట్టు నుంచి తాళ్లకు వేలాడబడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినా గౌడన్నల ప్రాణాలకు ముప్పు ఏర్పడకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేసింది. వారి రక్షణ కోసం ‘కాటమయ్య రక్ష’ అనే సేఫ్టీ కిట్లను ముందుకు తెచ్చింది. ఈ సేఫ్టీ కిట్ల పంపిణీ స్కీమ్‌ను ఆదివారం ప్రారంభించనుంది.

 

ఈదుళ్లు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం ప్రభుత్వం కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, లష్కర్ గూడ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీం ప్రారంభించనున్నారు. అనంతరం, అక్కడే గౌడన్నలతో సమావేశమవుతారు. ఆ తర్వాత వారితో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు.

 

తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గీత కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలను అరికట్టడానికి ఆధునికతను జోడించి సేఫ్టీ కిట్లను తయారు చేశారు. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ ఈ కిట్లను తయారు చేసింది. గీత కార్మికులు సులువుగా తాడి చెట్లు ఎక్కేలా ఈ కిట్లను తయారు చేశారు. తాటి చెట్ల మీది నుంచి గౌడన్నల కిందపడకుండా అడ్వాన్స్ టెక్నాలజీని ఈ కిట్లలో నిక్షిప్తం చేశారు. ఒక్కో కిట్‌లో మొత్తం ఆరు పరికాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్‌లు, లెగ్ లూప్ వంటివన్నీ వేటికవిగా వేర్వేరుగా ఉంటాయి. గీత కార్మికులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలోనే యూజర్ ఫ్రెండ్లీగా ఈ కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్లు ఉంటాయి. ఈ నిర్ణయం పట్ల గౌడన్నలు సంతోషంగా ఉన్నారు. గతంలో కూడా సేఫ్టీ కిట్ల కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఏవీ సమర్థవంతంగా అమల్లోకి రాలేవు. ఈ సారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పట్టుదలగా ఉన్నది. ఈ కిట్ల పంపిణీ కోసం విధివిధానాలను ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram