రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
పోర్చుగల్‌కు చెందిన ప్రఖ్యాత గుల్బెంకియన్ అవార్డ్ ఫర్ హ్యుమానిటీస్‌ను దక్కించుకున్న ఏపీ సీఎన్ఎఫ్ ప్రతినిధులు, రైతులకు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.
పర్యావరణాన్ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2016లో టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిందని.. దాని ఫలాలే ఇప్పుడు అందుతున్నాయని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం ఏపీలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 10 లక్షల మంది రైతులకు ప్రతినిధిగా నాగేంద్రమ్మ అవార్డు అందుకోవటం మహిళా సాధికారతకు నిదర్శనం అని తెలిపారు. అంతే కాకుండా అవార్డు క్రింద ప్రకటించిన నిధిని అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు వినియోగిస్తామని వెల్లడించారు.పర్యావరణంతో పాటు పౌష్టికాహారం అందేలా రైతు సాధికార సంస్థ సారథ్యంలోని ఏపీసీఎన్ఎఫ్ కృషి చేస్తోందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వ్యవసాయ శాఖలతో కలిసి ఈ దిశగా కృషి చేయాలని కోరారు.
మంత్రిగా అచ్చెన్నాయుడు శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర జనాభాలో 62% మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం పలు శాఖలకు తాళం వేసిందని ఆరోపించారు.
వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి అయినప్పటికీ భూసారాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరీక్ష చేయలేదని ఆరోపించారు. గడిచిన పదేళ్లలో ఒక్క భూసార పరీక్ష కూడా జరగలేదన్నారు. విత్తనాలు, ఎరువులు కూడా లేక రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాలేదని మండిపడ్డారు.
రైతులు పంట అమ్ముకున్న 5,6 మాసాలకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో ఇక నుంచి ప్రతి రైతు ధైర్యంగా ఉంటారని అన్నారు. ఏ రైతుకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత వరకు సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.