E-PAPER

ప్రశ్నార్థకంగా వైఎస్ఆర్సిపి భవిష్యత్తు..?

ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటే.. ఆ సమస్యకు పునాది ఎక్కడ పడిందో తెలుసుకోవాలి. అలా కాకుండా.. పరిష్కారం పేరుతో పైపైన రంగులు దిద్దితే.. అది మూణాళ్ల ముచ్చటగానే ఉంటుంది. ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఓడిపోయామని పదేపది చెబుతున్న వైసీపీ అధినేత ఇప్పుడిప్పుడే ఓటమిపై విశ్లేషణ చేస్తున్నారు. కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్టు వైసీపీ ఓటమి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అయితే.. జగన్ అతి పెద్ద కారణాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి టీడీపీకి అనుకూలంగా పని చేశారని ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది.

 

గత ఎన్నికల్లో కనీసం 58 మందికి సిట్టింగులకు జగన్ టికెట్ ఇవ్వలేదు. అందులో సిద్దారెడ్డి కూడా ఒకరు. ఆయనకు బదులు కదిరిలో ఓ మైనార్టీ నేత మక్బూల్‌కు జగన్ అవకాశం కల్పించారు. ఆయన 6 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి అని స్థానిక వైసీపీ వర్గాలు జగన్ దృష్టికి తీసుకెళ్లాయి. ఆయన టీడీపీకి అనుకూలంగా పని చేశారని అధిష్టానం దగ్గరకు రిపోర్టులు వెళ్లాయి. దీంతో.. జగన్ ఆయనపై వేటు వేశారు. అయితే.. ఇది ఆరంభం మాత్రమేనని.. ముందు ముందు మరికొంతమందిని జగన్ సాగనంపుతారని వైసీపీలో చర్చ నడుస్తోంది. పార్టీలో ప్రక్షాళన మొదలైందనే ప్రచారం జరుగుతోంది.

 

టికెట్లు దక్కని చాలా మంది టీడీపీకి పని చేశారనే అనుమానంలో జగన్ ఉన్నారట. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ, అంతమంది సిట్టింగులను మార్చడం కూడా జగన్ తప్పేననే వాదనలు.. టికెట్ల కేటాయింపు సమయం నుంచే వినిపిస్తోంది. మరి దీనికి జగన్ బాధ్యత వహిస్తారా? ఈ విషయం పక్కన పెడితే.. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణ రెడ్డి అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. అసలు వైసీపీపై వ్యతిరేకత మొదలైందే సజ్జల దగ్గర నుంచి అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాల్సి వస్తే సజ్జలతోనే మొదలు పెట్టాలని చాలా మంది జగన్ దృష్టికి తీసుకెళ్తున్నారట.

 

గత ప్రభుత్వంలో సజ్జల అనే వ్యక్తిని లేకుండా చూస్తే కొంతమేర మంచి పాలన ఇచ్చామనే వైసీపీ నేతల అభిప్రాయం. ప్రభుత్వ సలహదారుడిగా ఉంటూ.. పార్టీని కూడా ఆయన శాసించారని చాలా మంది అక్కసు వెళ్లగక్కుతున్నారు. సోషల్ మీడియాలో విపక్షాలపై తప్పుడు ప్రచారం పరిధి దాటిందని.. ఇదే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అంతేకాదు.. మంత్రుల పనులు సజ్జల చేస్తే.. చంద్రబాబు, పవన్ ను తిట్టే బాధ్యతలు మంత్రులకు ఇచ్చారని.. ఇది కూడా ప్రజల్లో చెడ్డపేరు తెచ్చిందని అనుకుంటున్నారు.

 

క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని జగన్ కు తెలియజేయడానికి సజ్జల అడ్డుపడేవారని.. దీంతో.. జగన్ వాస్తవాలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. కాబట్టి.. మొదట సజ్జలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయట. సజ్జలపై చర్యలు తీసుకోకుండా.. ఎంత మందిని సస్పెండ్ చేసినా పార్టీలో ఎదుగు, బొదుగు ఉండదని అంటున్నారు. మరి జగన్ అలాంటి నిర్ణయం తీసుకుంటారా? చూడాలి. అయితే.. వైసీపీలో సజ్జల తనకు అనుకూలంగా ఓ వర్గాన్నే ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. సజ్జలపై వేటు పడితే.. వారంతా తిరగబడతారని.. పరిస్థితి చేయిదాటితే.. సజ్జల వారితో కలిసి బీజేపీలో చేరుతారే ప్రచారం కూడా నడుస్తోంది. మరి జగన్ తర్వాత అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.

Facebook
WhatsApp
Twitter
Telegram