ఏపీ ఆరోగ్య శ్రీ పథకం పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేసారు. ఇప్పటి వరకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి 2007లో దివంగత మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. డా. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరును సైతం ప్రభుత్వం మార్చింది. నందమూరి తారకరామారావు వైద్య సేవా ట్రస్ట్‌గా పేరు మార్పు చేసింది.
ఇదే విధంగా వైఎస్సార్ యంత్ర సేవ కేంద్రాలను విలేజ్ / క్టస్టర్ సీహెచ్‌సీ, వైఎస్సార్ యాప్‌ను వీఏఏ ఫర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్‌గా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వడ్డీలేని రుణాలుగా , ఈ క్రాప్ ఈ-పంటగా, వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ను అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. అంతే కాకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ఫామ్ మెకనైజేషన్ స్కీం, డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లుగా మార్పు చేసింది
ఆరోగ్యశ్రీ పథకం ముఖ్యంగా అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టారు. వైద్య సేవలందించడంతో పాటు రవాణా, భోజన వసతి సదుపాయాలను కూడా కల్పిస్తారు. ఈ పథకం ద్వారా 2014 సెప్టెంబర్ నాటికి 25 లక్షల మంది పేద రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. అయితే ఈ పథకం కింద 1038 పైగా జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడ్డాయి. ముఖ్యంగా ఈ పథకం ద్వారా ప్రజారోగ్యమే ప్రధాన ఉద్దేశంగా సేవలను అందిస్తూ అన్ని రోగాలకు వైద్యం అందించడం జరిగింది.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2.5 లక్షలవరకు వర్తింపు చేశారు.దారిద్యరేఖకు దిగువన ఉన్న పేదవారికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేసింది. ఈ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలను పొందవచ్చు.