తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 1 పరీక్షలను రాయబోయే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రాయబోయే అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. అంతేకాదు- ఉచిత కోచింగ్‌తో పాటు ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున మొత్తాన్ని స్టైపెండ్‌గా అందించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్‌లో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8, ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్‌లల్లో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతుంది. 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుక్ ఫండ్, రవాణా ఛార్జీలతో కలిపి ఈ మొత్తం ఇస్తారు.
గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు దీనికి అర్హులు. అర్హత ఉన్న వాళ్లు ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య www.tgbcstudycircle.cgg.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి తప్పనిసరిగా అయిదు లక్షల లోపు ఉండాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక ఉంటుంది.