ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సిక్కుల వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్‌పై నిషేధాన్ని పొడిగించింది. మరో అయిదు సంవత్సరాల పాటు నిషేధం నీడలో ఉంటుందీ సంస్థ.
అమెరికా ప్రధానకేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న వేర్పాటు సంస్థ ఇది. పంజాబ్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలనేది దీని ప్రధాన డిమాండ్. 16 సంవత్సరాల కిందట అంటే 2007లో ఇది ఏర్పాటైంది. ప్రముఖ న్యాయవాది గుర్‌పట్వంత్ సింగ్ పన్నుమ్ దీన్ని స్థాపించారు.
జితేంద్రసింగ్ గ్రెవాల్.. ఇంటర్నేషనల్ పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్‌లల్లో క్రియాశీలకంగా ఉంటోంది సిక్స్ ఫర్ జస్టిస్. పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో వేర్పాటు వాదానికి ఆజ్యం పోస్తూ దేశవ్యాప్తంగా అశాంతియుత వాతావరణం ఏర్పడటానికి కారణమౌతోందనే ఉద్దేశంతో దీన్ని నిషేధించింది కేంద్ర ప్రభుత్వం.
తొలిసారిగా 2019 జులై 1వ తేదీన నిషేధం వేటు వేసింది. నిషేధం కాల వ్యవధిని అయిదు సంవత్సరాలుగా నిర్ధారించింది అప్పట్లో. తాజాగా దీని గడువు ముగిసిన నేపథ్యంలో నిషేధాన్నిపొడిగించింది. మరో అయిదు సంవత్సరాల వరకు అంటే 2009 జులై 1వ తేదీ వరకు నిషేధం అమలులో ఉంటుంది.
నిషేధ సమయంలో సిక్స్ ఫర్ జస్టిస్‌కు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలను కూడా నిర్వహించకూడదు. అలా నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలను తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ముందస్తు హెచ్చరికలు లేదా నోటీసులను కూడా జారీ చేయకుండా అదుపులోకి తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.
సిక్స్ ఫర్ జస్టిస్ ప్రతినిధులు, సభ్యులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారాన్ని ఇటీవలే సేకరించింది జాతీయ దర్యాప్తు సంస్థ. నిషేధాన్ని పొడిగించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యుఏపీఏ కింద ఈ నిర్ణయాన్ని తీసుకుంది.