E-PAPER

ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రాజీనామా ..!

ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే రిటైర్ అయిన ఆయన్ను పదవీకాలం పొడిగించడంతో ఇంకా ఆ పదవిలోనే ఉన్నారు.

 

అయితే తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన్ను ప్రభుత్వం సాగనంపినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి.

 

గతేడాది అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా ఉన్న బాలకృష్ణమాచార్యులు రిటైర్మెంట్ తో రామాచార్యులు ఈ పదవిలోకి వచ్చారు. అయితే ఆయన పదవీకాలం కూడా పూర్తి కావడంతో రిటైర్ అయ్యారు. కానీ వైసీపీ ప్రభుత్వం రామాచార్యులు సర్వీస్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ఇప్పటికీ కొనసాగుతున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారని పేరున్న రామాచార్యులుపై మొదటి నుంచీ కూటమి సర్కార్ పార్టీలకు సదభిప్రాయం లేదు.

 

తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అనుకూల ఛానళ్లపై నిషేధం విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించినా రామాచార్యులు మాత్రం అందుకు వెంటనే సహకరించలేదు. నిబంధనల పేరుతో స్పీకర్ అయన్నపాత్రుడినే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారన్న విమర్శలు ఉన్నాయి. కానీ కూటమి నేతలు పట్టుబట్టడంతో స్పీకర్ వెంటనే ఫైల్ తెప్పించుకుని ఆయా ఛానళ్లపై అసెంబ్లీ కవరేజ్ కు ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. అప్పటి నుంచి రామాచార్యులుపై వేటు కత్తి వేలాడుతోంది.

 

తాజాగా ప్రభుత్వం రిటైర్ అయినప్పటికీ వైసీపీ సర్కార్ ఇచ్చిన పొడిగింపుతో కొనసాగుతున్న ఉద్యోగులను తప్పుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రామాచార్యులు కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన రాజీనామాను స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు కూడా పంపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram