లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో రాహుల్ గాంధీ హింసాకాండ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి ఉండాల్సిందని అన్నారు. ప్రధాని మోదీ మణిపూర్‌కు వచ్చి ప్రజలకు విశ్వాసం భరోసా కల్పించాలని చెప్పారు. తన పర్యటనలో రాహుల్ గాంధీ కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలను విన్నారు. మణిపూర్‌లోని రెండు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్న తర్వాత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. రాహుల్ ఇప్పటి వరకు మణిపూర్‌లో మూడుసార్లు పర్యటించారు. గత ఏడాది మే 3న కుల హింస చెలరేగిన కొంతకాలం తర్వాత రాష్ట్రాన్ని సందర్శించారు. దీని తరువాత, జనవరి 2024 లో, ఆనై మణిపూర్ నుండి భారత్ జోడో న్యాయ యాత్రను కూడా ప్రారంభించారు. తాజాగా రాహుల్ గాంధీ జూలై నెలలో మణిపూర్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు.
ప్రధాని మోదీ మణిపూర్‌కు రావాలి
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడుతూ హింసాత్మకమైన మణిపూర్‌కు ప్రధాని మోదీ రావడం చాలా ముఖ్యమని అన్నారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కూడా ప్రస్తావించిన రాహుల్.. ప్రధాని మోదీ మణిపూర్ ప్రజల మాట వినాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పిన రాహుల్… భారత దేశం గర్వించదగ్గ రాష్ట్రంగా మణిపూర్‌ను అభివర్ణించారు. ఇలాంటి కష్ట సమయాల్లో ప్రధాని మణిపూర్ వచ్చి ఇక్కడి బాధితులకు భరోసా ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. ఒక రెండ్రోజుల సమయం తీసుకుని వచ్చి మణిపూర్ కష్టాలను వినాలని ప్రధాని కోరుతున్నట్లు రాహుల్ చెప్పారు.ఇది మణిపూర్ ప్రజలకు ఊరటనిస్తుందని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ సోమవారం తన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు . విలేకరుల సమావేశం అనంతరం జర్నలిస్టుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తాను చెప్పేది గౌరవించాలని,స్పష్టమైన సందేశం ఇవ్వడానికే తాను మణిపూర్ రాష్ట్రానికి వచ్చినట్లు రాహుల్ పేర్కొన్నారు. అంతే తప్ప సమస్యల నుంచి దారి మళ్లించే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు రాలేదని స్పష్టం చేశారు.
సహాయ శిబిరాలను సందర్శించిన రాహుల్
రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్‌లోని జిరిబామ్ మరియు చురచంద్‌పూర్ జిల్లాల్లోని సహాయక శిబిరాలను సందర్శించి అక్కడ నివసిస్తున్న ప్రజలతో మాట్లాడారు. గత ఏడాది మే నెలలో రాష్ట్రంలో మైతీ, కుకీ అనే రెండు వర్గాల మధ్య కుల హింస మొదలైంది. హింసాకాండలో 200 మందికి పైగా చనిపోయారు. లక్షలాది మంది ప్రజలు సహాయక శిబిరాల్లో ఉండాల్సి వస్తోంది. వారిని కలిసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. రెండు వర్గాలకు చెందిన ఘర్షణలో తమవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చారు రాహుల్ గాంధీ. “నేను మణిపూర్‌కి చెప్పాలనుకుంటున్నాను, నేను మీ సోదరుడిగా ఇక్కడకు వచ్చాను. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడానికి మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను” అని రాహుల్ గాంధీ బాధితులతో చెప్పారు.