తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కలకలం కొనసాగుతుంది. డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. వర్షాకాలం వచ్చిందంటే వర్షాకాలంతో పాటు సీజనల్ రోగాలు కూడా వస్తుంటాయి. వర్షాకాలంలో దోమల బెడదతో పాటు రోగాలు పెరుగుతాయి అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుంది.
రాష్ట్రంలో డెంగ్యూ కేసులు రాష్ట్రంలో గత నెలలో మొత్తం 263 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9 మలేరియా కేసులు నమోదు అయినట్టు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగ్యూ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయని పేర్కొంది. అయితే కేసులు పెరిగే అవకాశం ఉందని, వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు.
కేసుల పెరుగుదలపై జిల్లా అధికారులకు అలెర్ట్ కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆసుపత్రులలో వసతులపైన, మందుల లభ్యత పైన కూడా దృష్టి పెట్టాలని ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు సూచించింది. రోజువారీ కేసులను రిపోర్టు చేయాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
డెంగ్యూ లక్షణాలు ఇవే మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులలోను నమోదవుతున్న డెంగ్యూ కేసుల వివరాలు ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు. విపరీతమైన జ్వరం, నిరంతరం తలనొప్పి, కళ్ళల్లో నొప్పి, కనురెప్పల చుట్టూ నొప్పి, ఒళ్ళు నొప్పులు, మంటతో కూడిన కీళ్ల నొప్పులు, అనారోగ్యానికి గురైన కొద్ది రోజులలో దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.
డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇక నిరంతరం వాంతులు, చిగుళ్లలో రక్తస్రావం, కడుపునొప్పి, సులభంగా గాయాలు అయితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. దోమల నుండి శరీరాన్ని కాపాడుకోవాలని, ఇంటి పరిసరాలలో దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. డెంగ్యూ బారిన పడకుండా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.