ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీని స్వచ్చతా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రంగంలోకి దిగారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల అన్ని గ్రామాలలో స్వచ్ఛతను ప్రోత్సహించేందుకు పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించారు.
అధికారులకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం రోజురోజుకీ పెరుగుతున్న ఘన, ద్రవ వ్యర్ధాల మూలంగా గ్రామాలలో పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రతరం అవుతున్నాయని పేర్కొన్న పవన్ కళ్యాణ్ శాస్త్రీయ విధానంతో వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి తగినట్టుగా స్థానిక సంస్థలతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పనిచేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పొరేషన్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు.
ప్రజలను భాగస్వాములను చేసే ప్రత్యేక కార్యాచరణ ఈ కార్యాచరణను ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాలలో అమలు చెయ్యాలని సూచించారు. స్థానిక సంస్థలతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేసి తమ గ్రామాలను స్వచ్చంగా ఉంచుకునేందుకు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చే విధానాలను వారికి తెలియజేయాలన్నారు.
ఎకో వారియర్స్ తో పర్యావరణ పరిరక్షణ పర్యావరణం పై ఎక్కువ మక్కువ ఉన్నవారిని ఎకో వారియర్స్ గా ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇదే సమయంలో నగరాలు, పట్టణాలు, మేజర్ గ్రామపంచాయతీలలో ఉన్న డంపింగ్ యార్డుల సమస్య తన దృష్టికి వచ్చిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ భీమవరం పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డు సమస్య తీవ్రతను తాను స్వయంగా చూశానని తెలిపారు.
వ్యర్ధాల నిర్వహణ, డంపింగ్ సమస్యలపై పవన్ దృష్టి అక్కడ అనారోగ్యకర పరిస్థితుల కారణంగా పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వ్యర్ధాల నిర్వహణ, డంపింగ్ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలను భాగస్వాములను చేస్తూ పని చేయాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాలలో చెరువులు, కాలువల వెంబడి చెత్త వేసే విధానాలను ఆపాలని కాలుష్యంత్రణ మండలి సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు.
వాటిని చెత్త కేంద్రాలుగా మార్చొద్దు నదీ పరివాహక ప్రాంతాలు చెరువులు, కాలువల గట్లను చెత్త వేసే కేంద్రాలుగా మార్చకూడదని, ప్రజలు, వాణిజ్య సంస్థల వారు అక్కడ చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామాలలో వ్యర్ధాల నిర్వహణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుపై అధికారుల నుంచి నివేదిక తీసుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని స్వచ్ఛతా రాష్ట్రంగా తీర్చిదిద్దే విషయంలో అధికారులకు కీలక సూచనలు చేశారు.