ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. దేశ రాజధానిలో ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. రెండో రోజున పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాల గురించి వారితో చర్చించారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
తన ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు ఇదివరకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడం సహా వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి చొరవ తీసుకోవడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బకాయిలను వెంటనే విడుదల చేయడం వంటి డిమాండ్లను మోదీ ముందు ఉంచారు.
ఇప్పుడు తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వైద్య- ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఆర్థికపరమైన అంశాలను నిర్మలా సీతారామన్‌కు వివరించారు. ప్రధాని మోదీతో జరిగిన భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన విషయాలనే దాదాపుగా ఆమెకూ వివరించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవసరమైన నిధులను సత్వరమే విడుదల చేయాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఫైనాన్షియల్ క్లస్టర్స్, ఎకనమిక్ కారిడార్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీనికి అవసరమైన ప్రోత్సాహకాలను ప్రకటించాలని సూచించారు.
త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి అవసరమైన ప్రత్యేక నిధులను పొందుపరచాలని ఈ సందర్భంగా చంద్రబాబు.. నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ అభివృద్ధి కోసం అదనపు కేటాయింపులు చేయాలని కోరినట్లు చెబుతున్నారు.
బుందేల్ ఖండ్ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు దుగరాజపట్నం ఓడరేవును పూర్తి చేయడానికి తక్షణ నిధులను మంజూరు చేయాలని చంద్రబాబు వివరించారు.